KING JAMES BIBLEవెతుకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 కొరింతీ పత్రిక 2

అన్ని · 2 కొరింతీ పత్రికవెతుకు

1నేను బాధ కలిగించేలా మీ దగ్గరికి తిరిగి రాకూడదని నా అంతట నేనే నిశ్చయించుకున్నాను.

2నేను మీకు బాధ కలిగిస్తే బాధ పొందినవాడు తప్ప ఇంకెవరు నన్ను సంతోషపరచగలరు?

3నేను వచ్చేటప్పుడు ఎవరి వలన నాకు సంతోషం కలగాలో వారి వలన నాకు దుఃఖం కలగకుండా ఉండాలని ఈ సంగతి మీకు రాశాను. నా సంతోషమే మీ అందరి సంతోషమని నా నమ్మకం.

4మీకు బాధ కలగాలని కాదు, మీ పట్ల నాకున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఎంతో బాధతో, హృదయ వేదనతో, కన్నీళ్ళు కారుస్తూ రాశాను.

5ఎవరైనా నాకు బాధ కలగజేసి ఉంటే, నాకు మాత్రమే కాదు, కొంతవరకూ మీకందరికీ బాధ కలగజేశాడు (ఇంతకంటే కఠినంగా మాట్లాడడం నాకిష్టం లేదు).

6అలాంటి వాడికి మీలో ఎక్కువమంది వలన కలిగిన ఈ శిక్ష చాలు.

7కాబట్టి మీరిక అతణ్ణి శిక్షించకుండా క్షమించి, ఆదరించడం మంచిది. లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో.

8అందుచేత అతని పట్ల మీ ప్రేమ స్థిరపరచమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.

9మీరన్ని విషయాల్లో విధేయులై ఉంటారో లేదో అని మిమ్మల్ని పరీక్షించేందుకే అలా రాశాను.

10మీరు ఎవరినైనా దేని గురించి అయినా క్షమిస్తే నేనూ అతన్ని క్షమిస్తాను.

11నేను దేనినైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా, మీ కోసం, క్రీస్తు ముఖం చూసి క్షమించాను. సాతాను ఎత్తుగడలు మనకు తెలియనివి కావు.

12క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు, ప్రభువు నాకు ద్వారం తెరిచాడు. అయినా నా సోదరుడు తీతు కనిపించకపోవడంతో

13నాకు మనశ్శాంతి లేక, వారి దగ్గర సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియకు బయలుదేరాను. విజయవంతమైన పరిచర్య

14దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు.

15విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము.

16నాశనమైపోతున్న వారికి మరణపు వాసనగా, విమోచన పొందుతున్న వారికి జీవపు సువాసనగా ఉన్నాము. వీటికి యోగ్యులెవరు?

17దేవుని వాక్యాన్ని లాభం కోసం చాలామంది అమ్మేస్తున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు. మేమైతే సదుద్దేశంతో ఉన్నాం. దేవుడు మమ్మల్ని పంపించాడు. క్రీస్తులో దేవుని ఎదుట బోధిస్తున్నాం.

Sources and attribution